Jagga Reddy: మూడు సార్లు కరెంట్ పోయిందన్న కేసీఆర్.. జగ్గారెడ్డి సెటైర్లు

  • కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేశారన్న జగ్గారెడ్డి
  • కేసీఆర్ కు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ అవసరమా? అని ప్రశ్న
  • గత్యంతరం లేకే ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శ
Jagga Reddy satires on KCR

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసానికి కేసీఆర్ ఇటీవల వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తాము భోంచేస్తున్నప్పుడు మూడు సార్లు కరెంట్ పోయిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. మూడు సార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ చెపితే ఎవరైనా నమ్ముతారా? అని విమర్శించారు. కేసీఆర్ బాధ కరెంట్ గురించి కాదని... పొలిటికల్ పవర్ లేదనేదే ఆయన బాధ అని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేశారని అన్నారు. కేసీఆర్ మాటలను నమ్మేవారు ఎవరూ లేరని చెప్పారు. 

ఉమ్మడి ఏపీ ఎప్పుడు విడిపోతే అప్పుడు తెలంగాణ సీఎం అయిపోదామని కేసీఆర్ అనుకునేవారని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎలా జీవిస్తున్నారని ప్రజలను కేసీఆర్ ఎప్పుడైనా అడిగారా? అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కు ట్విట్టర్ అకౌంట్ లేదని... ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ అవసరం వచ్చిందా? అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఘోర పరాభవం ఎదురవుతుందని అన్నారు. గత్యంతరం లేకే ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు.

More Telugu News